శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్‌కీ జై

సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీకీ జై


సాయిబాబా సత్సంగమందిరం, చిత్తూరు

తొలి అడుగులు

పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీగారి అనుగ్రహాశీస్సులతో చిత్తూరు సాయిబాబా సత్సంగకేంద్రం 2005వ సంవత్సరం జనవరి మాసంలో ప్రారంభమైంది. తొలినాళ్ళలో చిత్తూరు, ఆఫీసర్స్ లైన్ లోని ఒక గృహంలో సత్సంగం జరిగేది. ఈ సత్సంగ కేంద్రం ప్రారంభించడానికి ముందు గురుబంధువు కీ॥శే॥ శ్రీమతి నాగరాజమ్మగారు పలు మార్లు గురువుగారిని అభ్యర్ధించి సత్సంగం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందారు. శ్రీసాయిబాబా మరియు పూజ్య గురుదేవుల పట్ల నాగరాజమ్మగారి భక్తి ప్రేమలు అనన్య సామాన్యంగా ఉండేవి. చిత్తూరులో సాయిబాబా సత్సంగం ప్రారంభించడం నుండి ఈనాటి సాయిబాబా సత్సంగమందిర నిర్మాణం వరకు ప్రతి దశలో శ్రీమతి నాగరాజమ్మగారి కృషి చిరస్మరణీయం.

సత్సంగ మందిర నిర్మాణం

ఒక మందిరం రూపుదిద్దుకోవడం స్థానిక భక్తుల అవసరం మేరకు జరగాలి. ఆలయం నిర్మించే ప్రదేశంలో మహాత్ముల చరిత్రల పఠనం,పవిత్ర ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాల అధ్యయనం, మహాత్ముల ఆశీస్సులు, సామూహిక జప ధ్యానాలు కొంతకాలం పాటు జరగాలి. నిత్య సత్సంగ స్వాధ్యాయ ప్రవచనాలపట్ల ఆ ప్రాంతం లోని ప్రజలకు శ్రద్ధాసక్తులు కలగాలి. అలా జరుగుతుంటే క్రమంగా ఆ కేంద్రమే దేవాలయంగా పరిణితి చెందుతుంది అని అంటారు పూజ్య గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీగారు.

2005వ సంవత్సరంలో ఒక గృహంలో ప్రారంభమైన సత్సంగకేంద్రం తరువాత కొన్నాళ్ళు ఇప్పటి సత్సంగమందిరానికి సమీపంలోని ఖాళీ ప్రదేశంలోని ఇసుక తిన్నెలపై, కొబ్బరి ఆకులతో కప్పిన కుటీరంలోనూ తరువాత రేకుల షెడ్డులోనూ కొనసాగింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని స్థానికులకు బాబా మరియు గురుదేవుల పట్ల భక్తిప్రపత్తులు కలిగాయి. సత్సంగకేంద్రంలో క్రమం తప్పకుండా సత్సంగ కార్యక్రమాలు, సాయినామ సంకీర్తనలు, సాయిచరిత్ర పారాయణలు కొనసాగాయి. ఈ దశలో తమ సత్సంగకేంద్రానికి ఒక శాశ్వత నిర్మాణం అవసరమని సత్సంగసభ్యులు భావించారు.

సత్సంగమందిర నిర్మాణానికి అనువైన స్థలాన్ని సూచించవలసినదిగా గురుబంధువులు పూజ్య గురుదేవులు శ్రీబాబూజీని ప్రార్థించడం జరిగింది. ఆ స్థలానికి సంబంధించిన రేఖాచిత్రాన్ని(map) వారి ముందు ఉంచినపుడు మందిరానికి అనువైన స్థలాన్ని వారే మౌఖికంగా సూచించడం జరిగింది. సత్సంగకేంద్రం యొక్క 9వ వార్షికోత్సవ సందర్భంగా 2015, జనవరి, 25వ తేదీ నాడు సత్సంగమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది.

శ్రీసాయికి సంబంధించిన ప్రతి పనిలో సాధ్యమైనంత ఎక్కువమంది భక్తులు పాలుపంచుకోవాలనేవారు శ్రీబాబూజీ. ఈ ఆదర్శానికి అనుగుణంగా ఎందరో గురుబంధువులు మందిర నిర్మాణ కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు. మందిరానికి అందమైన ఆకృతిని ఇవ్వడంలో శ్రీ క్రిస్ తమవంతు పాత్ర పోషించారు.

మందిర విశిష్టత

మందిర నిర్మాణం పూర్తయిన సందర్భంలో తిరుమల నుండి తిరువణ్ణామలై వెళుతూ పూజ్యులైన అమ్మగారు శ్రీ అనసూయమ్మగారు(పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీగారి సతీమణి) మందిరాన్ని సందర్శించడం జరిగింది. శిరిడీ మందిరంలోని గురుస్థాన్‌లో గల వేపచెట్టు నుండి విత్తనాన్ని సేకరించి ప్రత్యేకంగా ఒక కుండీలో పెంచి ఆ మొక్కను మందిర ప్రారంభోత్సవం నాడు ఆ ప్రాంగణంలో నాటడం జరిగింది. నేడు ఆ చెట్టు ఎంతో ఎత్తు ఎదిగి మందిరానికి ఎంతో పవిత్రతను,విశిష్టతను చేకూరుస్తోంది.

సత్సంగమందిరంలోని అఖండ దీపాలు శిరిడీలోని సాయిపథం సత్సంగహాలులో పూజ్య గురుదేవుల చేతుల మీదుగా వెలిగించబడిన దీపాలనుండి వెలిగించి, ఆ దీపాలను తిరువణ్ణామలై తీసుకొచ్చి అక్కడి నుండి చిత్తూరుకు తీసుకురావడం జరిగింది. పూజ్య గురుదేవులు సూచించిన స్థలంలో మందిరం నిర్మించబడటం, పవిత్రమైన గురుస్థాన్‌లోని వేపచెట్టు మాతృకగా కలిగిన వేపచెట్టు మందిర ప్రాంగణంలో ఉండటం, గురుదేవులు చేతుల మీదుగా ప్రజ్వలనం గావించబడ్డ దీపంనుండి వెలిగించబడిన అఖండ దీపం మొదలైన అంశాలు చిత్తూరు సత్సంగమందిరానికి సాయిపథాన ప్రత్యేకతను, పవిత్రతను తీసుకువచ్చాయి.

పచ్చని చెట్ల సోయగం, పక్షుల కిలకిలారావాలు సత్సంగమందిరానికి మరింత శోభను, రమణీయతను చేకూరుస్తున్నాయి. మందిర ప్రాంగణంలో అడుగిడిన వెంటనే ఈ ప్రశాంత వాతావరణం, సాయినాథుని సన్నిధి భక్తుల మనస్సులలో అప్రయత్నంగా శాంతి ఆనందాలు అనుభమయ్యేలా చేసి భక్తి భావనను ఇనుమడింపజేస్తుంది.

సాయిబాబా నామ సప్తాహాలు

చిత్తూరు సాయిబాబా సత్సంగ మందిర నిర్మాణం తరువాత ఇప్పటి వరకు రెండు సాయిబాబా నామ సప్తాహాలు జరిగాయి. సంఖ్యాపరంగా చిత్తూరులో సత్సంగ సభ్యులు తక్కువగా ఉన్నప్పటికీ సాయి అనుగ్రహ విశేషంగా రెండు నామ సప్తాహాలు ఘనంగా జరిగాయి. ఈ సప్తాహాల సందర్భంగా జరిగిన వివిధ సంఘటనలు చిత్తూరు సత్సంగం పట్ల శ్రీసాయిబాబా మరియు గురుదేవుల అనుగ్రహానికి ప్రతీకలుగా నిలిచాయి.

మొదటి సప్తాహం సందర్భంగా శిరిడీ నుండి ఒక అపరిచిత వ్యక్తి చిత్తూరు రైల్వేస్టేషన్‌లో దిగి సప్తాహం జరుగుతున్న బ్యానర్ చూసి సత్సంగ మందిరానికి వచ్చి తాను గురుస్థాన్‌లో 40 రోజులు ఉండి ప్రతిరోజూ సేకరించిన వేపాకులు,100 కు పైగా ఊదీ పాకెట్లు ఇవ్వడం జరిగింది. 2022 లో జరిగిన సప్తాహం సందర్భంగా గురుదేవుల కుమార్తె సాయినాథుని శృతి శిరిడీ నుండి ప్రసాదాలు తీసుకురావడం జరిగింది, రెండు సప్తాహాలకు శ్రీపూoడిస్వామి వారి అనుగ్రహం లభించడం గురుబంధువులకు కలిగిన ఎన్నో అనుభవాలకు కొన్ని ఉదాహరణలు సాయిపథంలో...

చిత్తూరు జిల్లాలోని పెనుమూరు, బంగారుపాళ్యం, శ్రీకాళహస్తి, కాలే పల్లి, మదనపల్లి, K.V.B. పురం మరియు తిరుపతి జిల్లాలోని గురుబంధువులు ప్రతి కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకుంటూ, సాయిపథం ఆదర్శాలకు అనుగుణంగా కుల, మత, వర్ణ, వర్గ, లింగ,ప్రాంతాలకు అతీతంగా సాయిపథాన ముందుకు సాగుతున్నారు. సాయిపథం విశిష్టతను, పూజ్య గురుదేవులతో తమకు గల అనుభవాలను, అవగాహనను సాటివారితో పంచుకుంటూ వారు సాయిమార్గంలో పురోగమించడానికి నిమిత్తమవుతున్నారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరగాలని, సాయిపథాన అందరూ మరింతగా మున్ముందుకు సాగాలని, ఇందుకు చిత్తూరు సత్సంగకేంద్రం వేదిక కావాలని చిత్తూరు సత్సంగ సభ్యుల అభిలాష.